మున్సిపల్ ఎన్నికలపై ఈ నెల 31న హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువడ్డాక.. ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రఎన్నికల సంఘం.. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని మరోసారి సరిచూసుకోవాలని, మున్సిపోల్స్ నిర్వహణకు సన్నద్ధమై ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం అశోక్‌కుమార్, సీడీఎంఏ కమిషనర్ శ్రీదేవి పాల్గొన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ నాగిరెడ్డి సూచించారు.
హైకోర్టు తీర్పు వచ్చాక మరోసారి భేటీ అయి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కలిపి 79,92,434 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. మొత్తం 3,103 వార్డుల్లో 9,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు, ప్రతి 800 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు. మీర్‌పేట కార్పొరేషన్‌లో వార్డుల విభజన జరుగని కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. కాగా, ఇటీవలే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు ఎడమచేతి మధ్య వేలిపై సిరా చుక్కా వేయాలని నిర్ణయించారు.