హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూట్ మ్యాప్ సిద్ధమయింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజ యం సాధించాక నిర్వహించిన కృతజ్ఞతా సభ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ఇచ్చిన హామీల అమలుపై మంత్రి జగదీశ్‌రెడ్డి కసరత్తు పూర్తిచేశారు. నవంబర్ 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇందుకోసం అన్నిఏర్పాట్లుచేయాలని జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాధాన్య అం శాలవారీగా సమస్యలను గుర్తించడంతోపాటు, త్వరితగతిన అభివృద్ధి జరిగేలా అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రైనేజీ పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మిషన్‌భగీరథ పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో పైప్‌లైన్ పను లు పూర్తయ్యాకే అంతర్గత రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గకేంద్రమైన హుజూర్‌నగర్‌లో దుమ్ముధూళితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హుజూర్‌నగర్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మట్టపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం, పొట్టిశ్రీరాములు సెంటర్ నుంచి లింగగిరి రోడ్, గాంధీపార్క్ నుంచి గోవిందాపురం వరకు రహదారుల నిర్మాణం, సైడ్‌లైన్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోనూ సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించతలపెట్టిన డ్రైనేజీ నిర్మాణాలపై నిపుణుల సలహాలు తీసుకోవాలని, సీసీ రోడ్ల నిర్మాణంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో చంద్రయ్య, డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్, హుజూర్‌నగర్ నగర పంచాయతీ కమిషనర్, ఏఈ తదితరులు పాల్గొన్నారు.